తెలంగాణలో రేపటి నుంచి ప్రజాపాలన కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం సర్కార్ శ్రీకారం చుట్టంది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు గురువారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారెంటీల లోగో, దరఖాస్తు ఫారంను సీఎం రేవంత్ రిలీజ్ చేశారు. ప్రజలంతా దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజాపాలన అమలుపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డుల్లో ఒక్కో వార్డుకు నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి చెప్పారు.
వార్డులోని బస్తీల్లో ఏ రోజూ కౌంటర్ ఏర్పాటు చేస్తామనేది ముందుగానే సమాచారం ఇస్తామని శ్రీధర్ బాబు తెలిపారు. ఒక్కో కౌంటర్కు ఒక టీం లీడర్, ఏడుగురు సభ్యులు ఉంటారన్నారు. మహిళలు, వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దరఖాస్తులు నింపడం తెలియని వారి కోసం వాలంటీర్లను కూడా అందుబాటులో ఉంచుతామని వివరించారు. ఒకవేళ కౌంటర్ ఏర్పాటు చేసిన రోజు దరఖాస్తు చేసుకోకుంటే జనవరి 6 వరకు ఎప్పుడైనా అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. దీంతో పాటు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.