ప్రజలకు వాస్తవాలను చూపెట్టడానికే మేడిగడ్డకు వచ్చాం : Sridhar Babu
మేడిగడ్డ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించారు. కుంగిన పిల్లర్ల గురించి ఎమ్మెల్యేలకు అధికారులు వివరించారు. మేడిగడ్డ సందర్శనకు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహా ఎంఐఎం ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ బాబు కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. ప్రజలకు వాస్తవాలను చూపెట్టడానికే మేడిగడ్డకు వచ్చినట్లు తెలిపారు. కాళేశ్వరంతో లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందన్నారు. కాళేశ్వరం నుంచి పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు చుక్క నీరు అందలేదని చెప్పారు. వాస్తవాలు తెలుస్తాయని భయపడే బీఆర్ఎస్ ప్రాజెక్టు సందర్శనకు రాలేదని ఆరోపించారు.
మరోవైపు కృష్ణా జలాల వివాదంపై నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తోంది. కాసేపట్లో ఈ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. నాగార్జున సాగర్, కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించొద్దని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో రేవంత్ సర్కార్ తీరును నిరసిస్తూ ఆ పార్టీ సభ నిర్వహిస్తోంది. కాగా రెండు ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించొద్దంటూ తెలంగాణ అసెంబ్లీ సోమవారం తీర్మానం చేశారు.