బీఏసీ మీటింగ్కు ముందు అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదం జరిగింది. బీఏసీ సమావేశానికి బీఆర్ఎస్ తరఫున ప్రతిపక్ష నేత కేసీఆర్ బదులుగా ఎమ్మెల్యే హరీశ్ రావు హాజరుకావడంపై శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు.. అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఏసీ సమావేశం ప్రారంభానికి ముందు స్టేషన్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి హరీశ్ రావు స్పీకర్ ఛాంబర్ కు వెళ్లారు. అప్పటికే కేసీఆర్ స్పీకర్ ప్రసాద్ కు ఫోనే చేసి తన తరఫున హరీశ్ మీటింగ్కు అటెండ్ అవుతారని చెప్పారు. అయితే మంత్రి శ్రీధర్ బాబు మాత్రం అందుకు ససేమిరా అన్నారు. హరీశ్ రావు బీఏసీ మీట్కు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
బీఏసీ మీటింగ్కు అనుమతించకపోవడంపై శ్రీధర్ బాబు, హరీశ్ రావు మధ్య వాగ్వాదం జరిగింది. తాను సమావేశానికి హాజరయ్యేందుకు స్పీకర్ ఓకే చెప్పారని హరీశ్ చెప్పగా.. తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని శ్రీధర్ బాబు అన్నారు. లిస్టులో పేరు లేకున్నా.. సభ్యుడు అనారోగ్యంతో రాకపోయినా వేరే ఎమ్మెల్యేలను గతంలో బీఏసీలోకి అనుమతించిన విషయాన్ని హరీశ్ గుర్తు చేశారు. దీనికి సంబంధించి రికార్డులు పరిశీలించాలని తాను చెప్పింది అబద్ధమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే శ్రీధర్ బాబు అభ్యంతరంతో స్పీకర్ సర్దుకుపోవాలని సూచించగా.. కాసేపు అక్కడే ఉన్న హరీశ్ రావు.. తిరిగి టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయానికి వెళ్లిపోయారు.