ఆయనో రాష్ట్ర మంత్రి.. కాదు కాదు సీనియర్ మంత్రి.. గత తొమ్మిదేళ్లుగా ఆయన ఆ పదవిలో ఉన్నారు. పైగా కేసీఆర్ కుటుంబానికి నమ్మకమైన వ్యక్తి. కానీ ఆయన చేసిన పని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ను వెనక్కి తోసేసి చేయి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
హైదరాబాద్లో స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ వేడుకను చూడడానికి ప్రజలు సైతం పెద్దసంఖ్యలో తరలివచ్చారు.ఈ క్రమంలో మంత్రి కేటీఆర్తో ఫొటోలు దిగేందుకు పలువురు ఉత్సాహం చూపించారు. స్టీల్ బ్రిడ్జి వద్దకు కేటీఆర్ వెంట తలసానితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు నడుస్తున్నారు. అయితే ఓ బీఆర్ఎస్ నేత తలసాని కంటే ముందు వెళ్తున్నాడు. దీంతో తలసాని ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
తలసాని వెంటనే సదరు నేతను వెనక్కి లాగిపడేశాడు. ఆ తర్వాత అతడిపై చెంపపై కొట్టినట్లు తెలుస్తోంది. ఇదంతా కేటీఆర్ వెనకే జరిగింది. అయితే మంత్రి కొట్టిన వ్యక్తి భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రమేష్గా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో మంత్రిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నియంతృత్వానికి ఈ ఘటనే నిదర్శనమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక ఈ వివాదంపై తలసాని ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.