రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తే చర్యలు తప్పవు - మంత్రి ఉత్తమ్

By :  Kiran
Update: 2023-12-25 10:48 GMT

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని రేషన్ షాపును పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలోని బియ్యం, ఇతర వస్తువల నాణ్యతను మంత్రి పరిశీలించారు. అనంతరం మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్.. మిల్లర్లు రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ బియ్యాన్ని రీసైకిల్ చేస్తే రైస్ మిల్లర్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. రేషన్ మాఫియా చేస్తే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో దాదాపు 70 నుంచి 75 శాతం రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరుగుతోందని ఉత్తమ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తుందని చెప్పారు. రీసైక్లింగ్‌లో ఎంత పెద్ద వారి ప్రమేయం ఉన్నా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌పై దాదాపు రూ. 56,000 కోట్ల అప్పుల భారం మోపిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఏటా రేషన్ షాపులకు ఇచ్చే సబ్సిడీని కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. కార్పొరేషన్ ను ముందుకు నడపలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రాష్ట్రంలో మిగులు ధాన్యాన్ని కర్నాటక, తమిళనాడుకు విక్రయించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.


Tags:    

Similar News