మేడిగడ్డ సందర్శనకు ఏర్పాట్లు చేయండి.. అధికారులకు ఉత్తమ్ ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ సందర్శనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. మేడిగడ్డలో బ్యారేజీలో పిల్లర్ కుంగడం చాలా తీవ్రమైన అంశమని.. బ్యారేజీ నిర్మాణం చేపట్టిన సంస్థ సహా సదరు అధికారులను పర్యటనలో తన వెంట ఉండేలా చూడాలని సూచించారు. జలసౌధలో నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. పెండింగ్ ప్రాజెక్టులు, తాజా పరిస్థితులపై మంత్రి ఆరా తీశారు. ప్రాజెక్టుల గురించి మంత్రికి ఈఎన్‌సీ మురళీధర్‌రావు వివరించారు.
ప్రాజెక్టుల వివరాలు సహా మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగడంపై ఈఎన్సీ మురళీధర్ రావు మంత్రికి వివరించారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి రూ.4600 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. అందులోని ఒక పిల్లర్ 1.2 మీటర్లు కుంగడంతో.. మరో మూడు పిల్లర్లపై ఆ ప్రభావం పడిందన్నారు. వెంటనే ప్రాజెక్టులో నీటిని తోడేయడంతో పిల్లర్ కుంగడం తగ్గిందని చెప్పారు. ఈ క్రమంలో ఎంత ఆయకట్టుకు నీరిచ్చేందుకు బ్యారేజీని నిర్మించారు.. ఖర్చు చేసింది ఎంత..? అని అధికారులను మంత్రి ప్రశ్నించారు.