తెలంగాణలో రేపటి నుంచి ప్రజా పాలన కార్యక్రమానికి కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం చుట్టంది. ఐదు గ్యారెంటీలకు గురువారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులకు ప్రజా పాలనపై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను లక్ష్యంతోనే ప్రజా పాలన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను అధికారులు ఎట్టి పరిస్థితుల్లో తిరస్కరించొద్దని.. అర్హులను ప్రభుత్వం గుర్తిస్తుందని తెలిపారు.
కొత్త రేషన్ కార్డుల జారీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఉత్తమ్ తెలిపారు. రేషన్ కార్డులు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని ఉత్తమ్ సూచించారు. దరఖాస్తుల స్వీకరణ మొక్కుబడిగా కాకుండా అధికారుల్లోనూ మార్పు వచ్చిందని ప్రజలు భావించేలా ఉండాలన్నారు. దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీగా వ్యవహరించాలని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని స్పష్టం చేశారు.