బీఆర్ఎస్ పాపాల్లో.. బీజేపీ పాత్ర ఉంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీ చేసిన పాపాల్లో బీజేపీ పాత్ర ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్ది ఆరోపించారు. రెండు పార్టీల మధ్య అలాయ్ బలాయ్ ఉందని, అందుకే రూ.లక్ష కోట్ల రుణం వచ్చిందని అన్నారు. శుక్రవారం (మార్చి 1) సచివాలయంలో నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో మాట్లాడిన ఆయన.. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల జరిగిన నష్టానికి ఇరిగేషన్ లో ఉన్న లోన్లన్నీ కేసీఆర్, కేటీఆర్ కట్టాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ నిర్మాణం లోపం ఉన్న కారణంగా.. ఎల్ అండ్ టీ కంపెనీకి చెల్లించాల్సిన రూ. 400 కోట్ల బిల్లును కావాలనే ఆపామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విజిలెన్స్ రిపోర్ట్ అందిందని, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సంద్భంగా చలో మేడిగడ్డకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని అసత్య ప్రచారం చేశారు. కానీ అక్కడ 160 టీఎంసీల నీళ్లున్నట్లు సీడబ్ల్యూసీ చెప్పిందన్నారు. మేడిగడ్డ.. ఓ బొందలగడ్డ.. అక్కడికి ఏం పీక పోతరు అన్నవాళ్లు, ఇప్పుడెందుకు వెళ్లారని ఉత్తమ్ ప్రశ్నించారు. గత ప్రభుత్వం కమిషన్లకు కక్కుర్తి పడి తెలంగాణ రైతుల భవిష్యత్ ను పణంగా పెట్టారని ఆరోపించారు. ఈ మేరకు మేడిగడ్డ విచారణ కోసం ఎన్టీఎస్ఏ కమిటీ వేయడాన్ని.. కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు. తాను రేపు ఢిల్లీ వెళ్తున్నానని, మేడిగడ్డ అంశంపై పలువురు నిపుణులను, అధికారులను కలుస్తానని చెప్పారు. వారితో పూర్తిస్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రాణహిత చేవెళ్లను పూర్తిచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందనే కుట్రతో కేసీఆర్ రీ డిజైన్ చేశారని ఆరోపించారు.