MLA Mahipal Reddy : మోదీని సీఎం కలిసినట్లే.. మేము కూడా రేవంత్ను కలిశాం: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

Byline :  Bharath
Update: 2024-01-23 16:11 GMT

బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావులు రేవంత్ నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. అయితే నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకేసారి సీఎంను కలవడం కచ్చితంగా పార్టీ మార్పుకు సంకేతమేనని తీవ్ర చర్చ మొదలైంది. కాగా ఈ విషయంపై పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు.

తమ నియోజకవర్గాలకు చెందిన అంశాలు, అభివృద్ధి కి సంబంధించి విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు క్లారిటీ ఇచ్చారు. ఈ భేటీపై అనవసరంగా ఊహగానాలు సృష్టించొద్దని ఇతర పార్టీ నేతలకు ఆయన సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి ఎలా కలిశారో.. తాము కూడా అలానే కలిశామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నాయకత్వంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లోకసభ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేస్తామని మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

అంతకుముందు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావులు ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కలిశారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి అదనపు భద్రత ఇవ్వాలని కోరారు. ఎన్నికల ప్రచార సమయంలో ఆయనపై దాడి జరిగిన నేపథ్యంలో వారు శివధర్ రెడ్డిని కలిసి సెక్యూరిటీ అంశంపై చర్చించారు.  




Tags:    

Similar News