ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఆయనకు ఓ కూతురు ఉంది. ఆమె ఆ తండ్రిపైనే పోరాటం సాగస్తోంది. తన తండ్రి అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ బహిరంగంగానే ఆరోపిస్తోంది. అంతేకాదు గతంలో ఆయనపై కేసు కూడా పెట్టింది. తాజాగా అందరి ముందే ఓ విషయంలో తండ్రిని నిలదీసింది. అయితే ఆ తండ్రి మాత్రం ఇవి ప్రత్యర్థులు చేస్తున్న కుట్రలు అని చెబుతున్నారు.
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తన సంతకం ఫోర్జరీ చేసి హైదరాబాద్‌లో తన పేరిట ఉన్న భూమిని వేరేవాళ్లకు అగ్రిమెంట్ చేశారని కేసు పెట్టిన కూతురు తుల్జా భవానీ.. తాజాగా చేర్యాల భూమి విషయంలో నిలదీశారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరితోత్సవం సందర్బంగా జనగామలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అక్కడికి కూతురు తుల్జా భవానీ రెడ్డి చేరుకుని తండ్రి చేతికి డాక్యుమెంట్ ఇచ్చి.. మీడియా ఎదుటే దానిపై ఉన్న సంతకాల గురించి ప్రశ్నించారు.
చేర్యాలలో తరకు తెలియకుండా తన పేరు మీద భూమి ఎందుకు కొన్నావని భవానీ రెడ్డి తండ్రిని నిలదీశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. ఆ సంతకం నీదే కదా అని ఎమ్మెల్యే అనగా.. అది ఫోర్జరీ సంతకమని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలుతుందని కూతురు స్పష్టం చేశారు. జనగామకు నేనే రాజునంటూ చెప్తావ్ కదా నాన్న.. ఇప్పుడు ఈ పనేంటీ అంటూ భవాని ప్రశ్నించారు.
అందరిముందు కూతురు తనను నిలదీయడంపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి భావోద్వేగానికిలోనై కంటతడి పెట్టారు. కూతురును తన రాజకీయ ప్రత్యర్థులు తప్పుదోవ పట్టించి తనపై ఉసిగొలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మీద వస్తున్న ఆరోపణలలో నిజం లేదని, కుటుంబ సమస్యను రాజకీయ ప్రత్యర్ధ్యులు పావుగా వాడుకుంటున్నారని అన్నారు. కాగా ఎమ్మెల్యేను కూతురు నిలదీయడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు.