కూతురిపై కోర్టుకెక్కిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. కీలక ఆదేశాలు..
జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి తన కూతురు తుల్జా భవాని రెడ్డే ప్రత్యర్థిగా మారింది. తండ్రి మీదే అవినీతి ఆరోపణలు చేస్తూ సంచలనం రేపింది. ప్రస్తుతం తండ్రి కూతుళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ క్రమంలోనే ముత్తిరెడ్డి కోర్టు మెట్లెక్కాడు. తన కూతురు తనమీద ఆరోపణలు చేయకుండా చూడాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది.
ప్రెస్, మీడియా, వాట్సాప్ ద్వారా ప్రకటనలు, యూట్యూబ్ సహా ఇతర ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ముత్తిరెడ్డిపై ఎలాంటి ఆరోపణలు చేయొద్దని కోర్టు తుల్జా భవానిని ఆదేశించింది. నేరుగాకానీ, పరోక్షంగాకానీ మాట్లాడొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ముత్తిరెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఇటీవలె ఓ భూమి విషయంలో అందరి మందు తండ్రిని నిలదీసింది తుల్జా భవానీ. అది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
అంతేకాకుండా తండ్రిపై సంచలన ఆరోపణలు చేసింది. తన తండ్రి భూమిని కబ్జా చేశాడని ఆరోపించింది. తన తండ్రి ఎన్నో తప్పుల్ని చేశాడు.. ఆయనకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వొద్దని కేసీఆర్కు విజ్ఞప్తి చేసింది. అయితే ప్రత్యర్థులు రాజకీయంగా తనను ఎదుర్కోలేక తన కూతురిని పావుగా వాడుకుంటున్నారని ముత్తిరెడ్డి అన్నారు. ప్రత్యర్థులను ప్రజలే తగిన బుద్ధి చెప్తారని చెప్పారు. ఇక తాజాగా కోర్టు ఆదేశాలతో తండ్రి కూతుళ్ల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింద.