ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు.. మహేశ్ కుమార్, బల్మూరి ఎన్నిక ఏకగ్రీవం..!
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఒక్కో అభ్యర్థి మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులు మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఇవాళ నామినేషన్లు సమర్పించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండగా.. ఆ ఇద్దరు మినహా ఎవరూ నామినేషన్ పత్రాలు సమర్పించలేదు.
శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరగనుండగా.. ఉప సంహరణకు 22 వరకు గడువు ఉంది. అయితే రెండు స్థానాలకు ఒక్కో అభ్యర్థి మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో పోలింగ్ జరిగే అవకాశంలేదు. మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిసిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
ఎమ్మెల్సీలైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంతో రెండు స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అసెంబ్లీ సెక్రటేరియెట్ రెండు స్థానాలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. ఒకవేళ పోలింగ్ జరిగినా రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించినా సంఖ్యాబలం దృష్ట్యా అధికార కాంగ్రెస్ పార్టీకే ఆ సీట్లు దక్కేవి.