పదవి పోయినా సరే ఆ పని మాత్రం చేస్తా.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన పదవి పోయినా సరే తన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లేకుండా చేస్తానని అన్నారు. సోమవారం మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో బెల్ట్ షాపుల మూసివేతపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మునుగోడు మండలంలోని 26 గ్రామాల నుంచి ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యపానం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఏ గల్లీలో చూసినా బెల్ట్ షాపులే దర్శనమిస్తున్నాయని అన్నారు. దీంతో యువకులు తాగుడికి బానిసగా మారి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మునుగోడులో బెల్ట్ షాపులు లేకుండా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలోనే గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకుండా చేయాలని పార్టీ నేతలకు సూచించారు. బెల్ట్ షాపుల వ్యతిరేక ఉద్యమం మునుగోడు నుంచే మొదలవ్వాలని, అందుకు ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేసుకొని పని చేయాలని అన్నారు.
ఇది రాజకీయాలతో సంబంధంలేని అంశమని, ఈ విషయంలో రాజీ పడేదిలేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టంచేశారు. బెల్ట్ షాపులు మూసి వేయడం గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యత అని అన్నారు. తాను మద్యపానానికి వ్యతిరేకం కాదని, మద్యం ఎక్కడబడితే అక్కడ దొరకడమే జనాలకు సమస్యగా మారిందని అన్నారు. ఇక బెల్ట్ షాపుల నిర్మూలనలో తనతో సహకరించేవారికే పార్టీ పరంగా ప్రాధాన్యత ఉంటుందని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు.