బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యను పక్కనబెట్టి కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. టికెట్ దక్కలేదని మనస్తాపం చెందిన రాజయ్య మంగళవారం (ఆగస్టు 22) పరామర్శకు వచ్చిన అనుచరులు, కార్యకర్తల ముందు కంటతడి పెట్టుకున్నాడు. ఈ క్రమంలో రాజయ్యను కలవడానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి హన్మకొండలోని ఆయన నివాసానికి వెళ్లారు.
అయితే అక్కడ రాజయ్య లేకపోవడంతో పల్లా వెనుదిరిగారు. అయితే, పల్లాను కలవడానికి రాజయ్య నిరాకరించినట్లు సమాచారం. తర్వాత స్థానిక కార్యకర్తలు, రాజయ్య అనుచరులను కలిసిన పల్లా.. పార్టీ అధిస్ఠానం ఆయనకు సముచిత స్థానం కల్పిస్తుందని తెలిపారు. రెండు మూడు రోజుల్లోనే కేసీఆర్ ను కలుస్తామని చెప్పారు. రాజయ్య, కడియం శ్రీహరి కలిసి స్టేషన్ ఘన్ పూర్ లో తిరిగి గులాబి జెండా ఎగరేస్తారన్నారు.