ఆడోళ్లతో తన్నిస్తా.. అధికారులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్
డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ పబ్లిక్ మీటింగ్‌లో రెచ్చిపోయారు. ఎదురుగా అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నేతలు అంతా ఉండగానే... అత్యుత్సాహంతో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. ఓ సందర్భంలో మాట్లాడుతూ.. అధికారులను ఆడవాళ్లతో తన్నిస్తానని చెప్పి నోరు జారారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్లలో సన్నాహక సమావేశం జరిగింది. డోర్నకల్ మండలంలో ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న తన 'పల్లె పల్లెకు రెడ్యానాయక్' కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక పకీర తండా వాసులు.. తమ తండాలో నీళ్లు రావడం లేదని చెప్పగా... మరమ్మతులకు రూ.5 లక్షల ఇచ్చి 4 నెలలు అవుతున్నా.. నేటికీ పనులు పూర్తి చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రెడ్యా నాయక్. అధికారులు ఇలా చేస్తే.. ప్రజలు తమకు ఓట్లు ఎలా వేస్తారంటూ రుసరుసలాడారు. ఈ క్రమంలోనే మరో 4 రోజుల్లో తన పర్యటన మొదలుకానుందని, ఆ లోపు అధికారులంతా పనులన్నీ చక్కబెట్టుకోవాలని హెచ్చరించారు. మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. బాధ్యులైన అధికారులను ఆడవాళ్లతోనే తన్నిస్తానని వ్యాఖ్యానించారు.
ఇక ఏ పార్టీకి చెందిన సర్పంచులైనా... అన్నింటిలో తమదే రాజ్యం అనుకోవద్దని.. ఎంపీటీసీ సభ్యులను కలుపుకొని పోవాలని సూచించారు. తాను చేయబోయే గ్రామాల పర్యటనలో పెద్ద ఎత్తున యువత, ప్రజలు పాల్గొనేలా చూడాలన్నారు. 'పల్లె పల్లెకు రెడ్యానాయక్' కార్యక్రమాన్ని విజయవంతం చేసి తనను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు. ఇక ఎమ్మెల్యే నోరుజారడం ఇదేం కొత్త కాదు.. అంతకుముందు కూడా .. బీఆర్ఎస్ కు తప్ప... ఇతర ల.. కొడుకులకు లేదని రెడ్యానాయక్ నోరు పారేసుకున్నారు. రేవంత్ రెడ్డిని బోసి.. కే అంటూ సంబోధించారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన నాయకుడు ఇలా మాట్లాడడంపై అప్పట్లోనే గుసగుసలు వినిపించాయి.