రోడ్డు కోసం సొంత ఇంటిని కూల్చేసిన ఎమ్మెల్యే

Update: 2024-01-27 07:46 GMT

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి అడ్లూర్ రోడ్డు విస్తరణకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ఇదే రహదారిలో ఎమ్మెల్యే ఇళ్లు ఉంది. ఈ నేపథ్యంలో రోడ్డు విస్తరణ కోసం స్వచ్చందంగా తన నివాసాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యే సిద్దమయ్యారు. గత ఏడాది జరిగిన సవాళ్లు, ప్రతి సవాళ్ళలో చెప్పినట్టుగానే రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్న తన సొంత ఇంటిని కూల్చేసి మాట నిలబెట్టుకున్నారు. మిగతా వాళ్ళు కూడా రోడ్డు వెడల్పు కోసం సహకరించాలని కోరారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి రైల్వే గేటు వరకు పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 30 ఫీట్లు మాత్రమే ఉంది. రహదారి వెడల్పు చేయడానికి వీలు లేకుండా అనేక మంది తమ నివాస గృహాలు నిర్మించుకున్నారు.

ఇళ్ల ముందు కుళాయి గుంతలు, షెడ్డులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే రోడ్డు వెడల్పు కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా ఎమ్మెల్యే ఒక అడుగు ముందుకు వేశారు. నేడు ఉదయం ఆర్‌అండ్‌బి, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు ఆధ్వర్యంలో జేసీబీలతో దగ్గరుండి ఇంటిని కూల్చేయించారు. అదే రోడ్డులో పంచముఖి హనుమాన్ ఆలయం కూడా ఉండటంతో అలయానికి ఇబ్బంది కలగకుండా రోడ్డు పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. అభివృద్ధికి ప్రజలు సహకరించాలని, వారం రోజుల్లో రోడ్డుపై ఉన్న కుళాయి గుంతలు, షెడ్డులు ప్రజలే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కోరారు.

Tags:    

Similar News