MLC Elections: నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు

Byline :  Veerendra Prasad
Update: 2024-01-18 07:43 GMT

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్‌ అభ్యర్థులు నామినేషన్‌లు వేశారు. నామినేషన్‌ దాఖలుకు నేడు ఆఖరి రోజు కాగా, కాంగ్రెస్‌ అభ్యర్థులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, బల్మూరి వెంకట్‌లు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. అభ్యర్థులుగా వెంకట్‌, అద్దంకి దయాకర్‌ పేర్లను ఫైనల్‌ చేసిన కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం చివరి నిమిషంలో.. దయాకర్‌ను తొలగించి పీసీసీ ఉపాధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ పేరును చేర్చింది. దీంతో వారిరువురు నేడు అసెంబ్లీ సెక్రటేరియట్‌లో నామపత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు.



ఈ నెల 29న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ జరుగనుంది. అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు. కాగా, అసెంబ్లీలో పార్టీల బలాబలాలను చూస్తే కాంగ్రెస్‌ పార్టీయే ఈ రెండు స్థానాలను దక్కించుకోనున్నది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడమే దీనికి కారణం. అయితే అధికార పార్టీ మినహా మరో పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపే అవకాశం లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవం కానున్నది.



Tags:    

Similar News