MLC Jeevan Reddy: లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావు
తప్పుడు ప్రచారంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఆ మాత్రం ఓట్లయినా పడ్డాయని... ఓడిపోయినప్పటికీ అంగీకరించే పరిస్థితిలో కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు లేరని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ... కేటీఆర్ ఆత్మస్తుతి, పరనింద నుంచి బయటపడాలని హితవు పలికారు. కేటీఆర్ అందులోంచి బయటకు రాకపోతే ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హెచ్చరించారు. బీఆర్ఎస్కు పరోక్ష మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఇప్పటికే కాచుకొని కూచుందన్నారు. కేసీఆర్ హయాంలో ప్రచారం తప్ప బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. అందుకే ఓడిపోయారని... అయినా వారికి జ్ఞానోదయం కలగడం లేదన్నారు.
మిషన్ భగీరథ పెద్ద స్కాం అని, కాళేశ్వరం రీ డిజైన్ పెద్ద బోగస్ అని, కేవలం కమీషన్ల కోసం రీ డిజైన్ చేసారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ను ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్గా మార్చి నిధులను మళ్ళించిందన్నారు. నిధుల దారి మళ్ళింపును చర్చకు రాకుండా చేసేందుకు దళితబందును తెరపైకి తెచ్చారన్నారు. గిరిజనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిండా ముంచిందని, అందుకే వాళ్ళు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారని జీవన్ రెడ్డి అన్నారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ బంధుల పేరుతో ఎన్నికల ముందు హాడావిడి చేసారన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా దక్కవన్నారు జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ తన అభ్యర్థులను మార్చితో సరిపోదన్నారు. అయినా ప్రజలు ఆ పార్టీ అధినాయకుడిని మార్చడానికి సిద్ధమయ్యారన్నారు