ఈటల రాజేందర్ హత్యకు కుట్ర పన్నుతున్నారన్న ఈటల జమున ఆరోపణలపై కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హత్యా రాజకీయాలు ఈటల రాజేందర్‌కే అలవాటని చెప్పారు. తాను ఆయనను చంపడం కాదు..ఆయనే తనను చంపిస్తారనే భయం ఉందన్నారు. తాను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు చంపేందుకు కుట్ర చేసినట్లు కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఉద్యమకారులను ఈటల రాజేందర్ ఎంతో టార్చర్ పెట్టారని.. 2001లో ఎంపీటీసీ బాల్ రెడ్డిని ఈటల హత్య చేయించారని కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
హుజురాబాద్ లో అమరవీరుల స్థూపాన్ని తొలగించడంపై కౌశిక్ రెడ్డి స్పందించారు. రోడ్డు విస్తరణలో భాగంగా మున్సిపల్ వాళ్లే దానిని తొలగించారని క్లారిటీ ఇచ్చారు. అసలు ఆ స్థూపం శిలాఫలకంపై ఈటల పేరు లేదని తెలిపారు. బీఆర్ఎస్ పుట్టినప్పుడు ఈటల ఎక్కడున్నారని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.
ఈటల జమున ఆరోపణలు
ఈటెల రాజేందర్ హత్యకు కుట్ర జరుగుతుందని ఆయన భార్య జమున సంచలన ఆరోపణలు చేశారు. రూ.20 కోట్లు ఖర్చు చేసి ఈటలను హత్య చేయడానికి కౌశిక్ రెడ్డి చేస్తున్నారని తెలిపారు. కౌశిక్ రెడ్డిని సీఎం కేసీఆర్ వెనుక నుంచి నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ ను జనంపైకి పిచ్చికుక్కలా వదిలేశారని జమున మండిపడ్డారు.