బాండ్ పేపర్లతో డ్రామాలా? కాంగ్రెస్‌ మొసలి కన్నీరును నమ్మితే ప్రజలకు కన్నీళ్లే: కవిత

By :  Bharath
Update: 2023-11-28 06:49 GMT

కాంగ్రెస్ పార్టీ నేతలు బాండ్ పేపర్లతో డ్రామాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత 30-40 ఏళ్ల నుంచి కాంగ్రెస్‌లో ఉన్న నాయకులకు బాండ్‌ పేపర్లు రాసిచ్చే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ మొసలి కన్నీరును నమ్మితే ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయని అన్నారు. తెలంగాణలో నిరుద్యోగ కాంగ్రెస్ నేతల సమావేశాలు మాత్రమే జరిగాయని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని, వ్యవసాయం, పరిశ్రమలు, ఇళ్లకు 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నామని చెప్పారు. మళ్లీ గెలిపిస్తే ఇంతకు మించిని అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2.30లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే.. వాటిలో ఇప్పటికే 1.30లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు గుర్తుచేశారు. ప్రైవేటు రంగంలో 30లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించినట్లు వివరించారు. తెలంగాణలో కొత్తగా 10 లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించామన్నారు. మరోసారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక గల్ఫ్‌ కార్మికులను ఆదుకునేందుకు కొత్త పాలసీ ప్రకటిస్తామని చెప్పారు.

రేషన్‌ కార్డుల సమస్యలు పరిష్కరించి అందరికీ రూ.5లక్షల బీమా కల్పిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందని, కర్నాటకలో మాదిరిగానే బాండ్ పేపర్లపై సంతకాలు చేస్తున్నారని అన్నారు. కర్నాటకలో ఇలాగే బాండ్ పేపర్లు రాసిచ్చి మాట తప్పినట్లు ఆరోపించారు. పదవుల కోసం కాంగ్రెస్ నేతలు దిగజారి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కర్నాటకలో సంతకాలు చేసి వందరోజులు గడుస్తున్నా.. ఒక్క కార్యక్రమం కార్యరూపం దాచలేదని విమర్శించారు. కాంగ్రెస్ మొసలి కన్నీళ్లకు బలైతే ఐదేళ్లు బాధ పడతారని అన్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ విషయంలోనూ అభివృద్ధి జరపలేదని మండిపడ్డారు. 9 ఏళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ హయాంలో 24 గంటల కరెంట్ ఇచ్చాం. 50 ఏళ్లలో 41 రిజర్వాయర్‌లు నిర్మిస్తే 9 ఏళ్లలో 107 రిజర్వాయర్‌లు బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించామని కవిత గుర్తుచేశారు.

Tags:    

Similar News