మహిళలకు టికెట్ల లొల్లి.. కిషన్ రెడ్డికి కవిత కౌంటర్

Update: 2023-08-22 14:54 GMT

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల శంఖారావం పూరించింది. మూడోసారి అధికారమే లక్ష్యంగా పార్టీ అధ్యక్షులు సీఎం కేసీఆర్ 115 మందితో కూడిన ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 115 మందితో కూడిన అభ్యర్థుల లిస్ట్ లో కేవలం ఏడుగురు మహిళలకు అవకాశం ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. లోక్ సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జంతర్ మంతర్ వద్ద దొంగ దీక్షలు చేస్తారని, తమ దగ్గరకు వచ్చేసరికి 33శాతం సీట్ల కేటాయింపు, మహిళా రిజర్వేషన్లు ఏమయ్యాయని మండిపడ్డారు. ఇదేనా కేసీఆర్ కుటుంబానికి వచ్చే లెక్కలని విమర్శించారు.

కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా వ్యతిరేకించారు. ట్విట్టర్ వేదికగా కిషన్ రెడ్డి కౌంటర్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇస్తామని రెండు సార్లు చెప్పి బీజేపీ మోసం చేసిందని మండిపడ్డారు. ఈ బిల్లుపై భారీ మెజారిటీ ఉన్నప్పటికీ ఎందుకు ఆమోదించట్లేదని నిలదీశారు. ఈ క్రమంలో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని మరోసారి డిమాండ్ చేశారు. ‘ఎట్టకేలకు బీజేపీకి చెందిన ఓ నాయకుడు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ గురించి ఆలోచించారు. కిషన్ అన్నా.. అత్యధిక మెజారిటీతో పార్లమెంట్ లో మీ పార్టీనే ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి 2సార్లు మేనిఫెస్టో పెట్టిన వాగ్దానాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటికైనా బిల్లును ఆమోదించండి. మీ రాజకీయ అభద్రతను మహిళా ప్రాతినిధ్యానికి ముడి పెట్టకండ’ని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేసింది.

Tags:    

Similar News