ప్రభుత్వ నిర్ణయంతో మహిళలకు 33 శాతం ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు.. MLC Kavitha
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర మహిళలకు ఉద్యోగ నియామకాల్లో తీవ్ర నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ లీడర్, ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ప్రభుత్వం హారిజాంటల్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్లను రద్దు చేశారన్నారు. 1996 నుంచి ఇప్పటివరకూ రోస్టర్ పాయింట్, హారిజంటల్ రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. రోస్టర్ పాయింట్ రిజర్వేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందని, ప్రస్తుత నిర్ణయంతో మహిళలకు 33 శాతం ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు , ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ , బీసీ మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇప్పుడు వేయబోయే నోటిఫికేషన్లకు వర్తిస్తుందా? గతంలో కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ లకు అమలు చేస్తున్నారా? అనేది రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హారిజంటల్ మహిళ రిజర్వేషన్ పై స్పష్టత ఇవ్వాలని, వెంటనే ఈ జీవో వెనక్కి తీసుకొనేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కవిత. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఉద్యోగార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. రాష్ట్ర మహిళలకు జరుగుతున్న అన్యాయంపై సోనియా గాంధీకి లేఖ రాస్తున్నట్లు తెలిపారు. మహిళలకు అన్యాయం చేయకుండా రేవంత్‌రెడ్డిని ఆదేశించాలని కోరారు. మహిళా రిజర్వేషన్ల స్ఫూర్తిని రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని, తెలంగాణ ఆడబిడ్డలు, యువత ఈ అంశాలను గమనించాలన్నారు కవిత.