MLC Kavitha : కులగణన తీర్మానం కేవలం కంటితుడుపు చర్యే: ఎమ్మెల్సీ కవిత

Byline :  Bharath
Update: 2024-02-17 08:34 GMT

కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతకుముందు దీనిపై చర్చ సాగింది. బీఆర్ఎస్ సభ్యులు పలు అభ్యంతరాలు లేవనెత్తగా.. అన్నింటిని పరిగణలోకి తీసుకుని ముందుకు సాగుతామని అధికార పార్టీ చెప్పింది. దీంతో ఈ తీర్మానానికి బీఆర్ఎస్ సైతం ఆమోదం తెలిపింది. త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. దీనికి అవసరమైన విధివిధానాలను ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదు. ఈ అంశంపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత కులగణన తీర్మానం కేవలం కంటితుడుపు చర్య అని కొట్టిపడేశారు. బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంనికి చిత్తశుద్ధి లేదని కవిత విమర్శించారు. కులగణనకు చట్టబద్ధత కల్పించి, వెంటనే దాన్ని అసెంబ్లీలో ఆమోదించాలని డిమాండ్ చేశారు. బీసీ సబ్ ప్లాన్ కు కూడా చట్టబద్ధత కల్పించాలని తెలిపారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారో, ఎలా చేస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా చెప్పలేదని అన్నారు. కులగణనపై స్పష్టత లేకుండా.. బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తలాతోక లేని కులగణన తీర్మానాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని కవిత చెప్పారు. బీసీలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బీహార్, కర్ణాటక రాష్ట్రాల్లో కులగణన చేపట్టే ముందు చట్టం చేశారని.. కాంగ్రెస్ పార్టీది బీసీ వ్యతిరేక చరిత్ర అని ఆరోపించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో జరిగిన మండల్ కమిషన్ సమయంలో బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడారని గుర్తుచేశారు. 2011లో యూపీఏ హయాంలో చేసిన కులగణన నివేదికను ఇంకా ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు బీసీలు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చారో చెప్పాలని రాహుల్ గాంధీని నిలదీశారు.




Tags:    

Similar News