ఫూలే విగ్రహం కోసం ఈ నెల 12న మహాధర్నా.. MLC Kavitha

Update: 2024-02-04 12:24 GMT

అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ ఈ నెల 12న భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నట్లు భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వంకుంట్ల కవిత తెలిపారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద జరగనున్న ధర్నాలో పాల్గొనాల్సిందిగా ఆయా రాజకీయ పార్టీలకు, బీసీ సంఘాలకు, మేధావులు, ప్రొఫెసర్లకు కవిత పిలుపునిచ్చారు.ఈ నేపథ్యంలోనే ఈలోగా అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి గానూ ఉమ్మడి జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు జరగనున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు ఈ సమావేశాలు ఉంటాయని అన్నారు.

ఇక ఉమ్మడి జిల్లాల్లో జరగనున్న ఈ రౌండ్ సమావేశాలకు తాను హాజరు కానున్నట్లు కవిత పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీన ఉదయం వరంగల్‌, మధ్యాహ్నం కరీంనగర్ , 7వ తేదీన ఉదయం వికారాబాద్‌, మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌లో, 8వ తేదీన ఉదయం ఆదిలాబాద్‌, మధ్యాహ్నం నిజామాబాద్‌, 9వ తేదీన ఉదయం ఖమ్మం, మధ్యాహ్నం నల్గొండ, ఈ నెల 10వ తేదీన సంగారెడ్డిలో సమావేశాలు జరుగతాయని తెలిపారు. ఆయా జిల్లాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, బీసీ సంఘాల నేతలు, ఇతర ప్రముఖులను రౌండ్ టేబుల్ సమావేశాలకు యునైటెడ్ పూలే ఫ్రంట్, భారత జాగృతి ప్రతినిధులు ఆహ్వానిస్తున్నారు.

Tags:    

Similar News