Mlc Kavitha : సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ.. విచారణకు హాజరుకావడంపై..
సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. బిజీ షెడ్యూల్ వల్ల ఈ నెల 26న విచారణకు హాజరుకావడం లేదని లేఖలో తెలిపారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు లేదా ఉపసంహరించుకోవాలని కోరారు. ఒకవేళ ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఏమైన ప్రశ్నలు అడగాలనుకుంటే వర్చువల్గా అందుబాటులో ఉంటానని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల వేళ సీబీఐ నోటీసులు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది కవిత ఆరోపించారు.
సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం కరెక్ట్ కాదని కవిత అభిప్రాయపడ్డారు. 2023 డిసెంబర్లో అప్పటి ఐవో ఇదే తరహా నోటీసును సెక్షన్ 160 కింద ఇచ్చారని.. ఆ నోటీసులకు ఇప్పటి సీఆర్పీసీ 41 నోటీసులు విరుద్ధంగా ఉన్నాయన్నారు. సెక్షన్ 41ఏ కింద ఎందుకు, ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదని చెప్పారు. ఈడీ నోటీసులపై తాను దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంలో విచారణ జరుగుతోందని.. తనను విచారణకు పిలవమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చారని కవిత గుర్తు చేశారు.
ఈ హామీ సీబీఐకి కూడా వర్తిస్తుందని కవిత అన్నారు. ‘‘గతంలో సీబీఐ నన్ను విచారించినప్పుడు అన్ని విధాల సహకరించాను. కానీ 15 నెలల విరామం తరువాత ఇప్పుడు పిలవడం, సెక్షన్ల మార్పు వంటి అంశాలు అనేక అనుమానాలకు తావిస్తుంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నాకు మా పార్టీ కొన్ని బాధ్యతలు అప్పగించింది. వచ్చే 6 వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం, సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. కాబట్టి ఫిబ్రవరి 26న జరిగే విచారణకు హాజరుకాలేను. కాబట్టిన నోటీసులను రద్దు చేయండి’’ అని కవిత లేఖలో తెలిపింది. కాగా ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని కవితకు సీబీఐ ఇటీవలే నోటీసులు జారీ చేశారు.