MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా

Update: 2024-02-05 06:10 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. లిక్కర్ పాలసీ కేసులో తన ప్రమేయం లేకుండా ఈడీ నోటీసులు జారీ చేసిందని కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు ధర్మాసనం ఫిబ్రవరి 16 తేదీకి వాయిదా వేసింది. సీఆర్పీఎస్ నిబంధనలు పాటించడం లేదని, ఈడీ ఆఫీసులో మహిళను విచారించడం సరికాదంటూ కవిత పిటిషన్‌లో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కవితను పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. దీంతో, ఈడీ విచారణపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని పిటిషన​్‌ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి తనపై ఎలాంటి బలవంతపు చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును కవిత కోరారు. ఇక, కవిత పిటిషన్‌పై నేడు జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ విచారణ జరుపనున్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం 2021 నవంబర్లో నూతన లిక్కర్ పాలసీని ప్రవేశపెట్టింది.

ఈ పాలసీ ప్రకారం మద్యం రిటైల్ అమ్మకాల నుంచి ప్రభుత్వం వైదొలిగి లైసెన్స్ కలిగిన ప్రయివేట్ వ్యక్తులకు లిక్కర్ స్టోర్లను నడిపేందుకు అవకాశం ఉంటుంది. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడానికి, ప్రభుత్వ ఆదాయం పెంచడానికి, కస్టమర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండటం కోసం నూతన మద్య విధానం ఉపయోగపడుతుందని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఈ కేసులో కల్వకుంట్ల కవిత, వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అరబిందో ఫార్మాకు చెందిన శరత్ రెడ్డి తదితరులతో కూడిన సౌత్ గ్రూప్ ప్రమేయం ఉందని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. గోవా ఎన్నికల ప్రచారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ సౌత్ గ్రూప్ నిధులు సమకూర్చిందని ఈడీ ఆరోపించింది. ఆ డబ్బును ఢిల్లీలో తమ నియంత్రణలో ఉన్న లిక్కర్ వ్యాపారం ద్వారా తిరిగి పొందిందని ఈడీ ఆరోపించింది. నూతన మద్యం పాలసీ ద్వారా లైసెన్సులు ఇచ్చే సమయంలో ఆప్ సర్కారు ఈ లిక్కర్ నెట్‌వర్క్‌లకు అనుకూలంగా వ్యవహరించిందని దర్యాప్తు సంస్థ ఆరోపించింది.2022 నవంబర్లో అరబిందో ఫార్మాకు చెందిన శరత్ రెడ్డితోపాటు బినయ్ బాబు అనే ఓ లిక్కర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో శరత్ రెడ్డి అప్రూవర్‌గా మారారు. 2023 ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ కవిత దగ్గర సీఏ పని చేసిన బుచ్చి బాబును సీబీఐ అరెస్ట్ చేసింది.

Tags:    

Similar News