Palla Rajeshwar Reddy: ముత్తిరెడ్డి కాళ్లు మొక్కిన పల్లా.. లక్ష మెజార్టీతో గెలిపించాలన్న ఎమ్మెల్యే
ఒకరు ఎమ్మెల్యే.. మరొకరు ఎమ్మెల్సీ.. ఈ సారి ఎమ్మెల్యేకు కాకుండా ఎమ్మెల్సీకి పార్టీ అధినేత టికెట్ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యేకు కోపం నశాళానికి అంటింది. ఎమ్మెల్సీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన పోటీచేస్తే పార్టీకి తీవ్ర నష్టం జరగుతుందని అన్నారు. సీన్ కట్ చేస్తే... ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకున్నారు. ఎమ్మెల్సీని లక్ష మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చాడు. దీనికి జనగామలో కేసీఆర్ సభ సందర్భంగా నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల సన్నాహాక సమావేశం వేదికైంది.
జనగామ టికెట్ ఈ సారి ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కాకుండా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. దీంతో పల్లాపై ముత్తిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ముత్తిరెడ్డిని ఆర్టీసీ చైర్మన్గా నియమించారు. అదేవిధంగా మంత్రి కేటీఆర్ సైతం వారితో మాట్లాడి ఇద్దరికీ సయోధ్య కుదిర్చారు. దీంతో జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సీన్ ఒక్కసారిగా మారింది.
ఈ క్రమంలో నిర్వహించిన కార్యకర్తల సన్నాహక సభలో ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డిని ముత్తిరెడ్డి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. రాజేశ్వర్ రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పార్టీ గెలుపే తన లక్ష్యమన్నారు. ఈ క్రమంలో ముత్తిరెడ్డి కాళ్లను రాజేశ్వర్ రెడ్డి మొక్కారు. హరీష్ రావు సైతం ముత్తిరెడ్డిది పెద్ద మనసు అంటూ కొనియాడారు.