తెలంగాణ రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. శుక్ర, శనివారాల్లో మోస్తరు నుండి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం ఉత్తర కోస్తా కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 45 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని, దీని ప్రభావంతో వర్షాలు పడతాయని వివరించింది.
ఇక హైదరాబాద్ లో ఈరోజు ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం అయి కనిపించింది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వాయువ్య దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.6 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 90 శాతంగా నమోదైంది.
గురువారం నాడు హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. బషీర్ బాగ్, ఎంజే మార్కెట్, ట్యాంక్ బండ్ దగ్గర వర్షం కురిసింది. సరూర్ నగర్ మిని ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ముషీరాబాద్, చిక్కడపల్లి, దోమలగూడ, కవాడిగూడ, భోలక్ పూర్, గాంధీనగర్, రాంనగర్, అడిక్ మెట్, అడ్డగుట్ట, మారేడ్ పల్లి, సీతాఫల్ మండి, బోయిన్‌పల్లి, ప్రకాష్ నగర్, రాణిగంజ్, ప్యారడైజ్ సహా పలు చోట్ల వర్షం కురిసింది.