Heavy Rains Alert : చల్లని కబురు.. రేపటి నుండి పలు జిల్లాల్లో వర్షాలు

Byline :  Veerendra Prasad
Update: 2023-09-02 02:28 GMT

వర్షాకాలంలో సైతం ఎండలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు శుభవార్త. రానున్న మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాన చినుకుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వార్త ఎంతో ఉపశమనాన్ని కలగజేయనుంది. రాష్ట్రంలో ఆదివారం నుంచి మంగళవారం వరకు ఉత్తర, దక్షిణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ శుక్రవారం తెలిపింది. 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్(Yellow Alert) హెచ్చరికలు జారీచేసింది. శనివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

‘ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. దక్షిణ ఆంధ్ర తీరం వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో 3న మరో ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నాయి. వీటి ప్రభావంతో వర్షాలు పడనున్నాయి’ అని వాతావరణశాఖ హైదరాబాద్‌ సంచాలకురాలు కె.నాగరత్న తెలిపారు. హైదరాబాద్‌ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. ఉదయం వేళ పొగమంచు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపారు.

శని, ఆది, సోమవారాల్లో ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ఎల్‌నినో ప్రభావంతో ఆగస్టు నెలలో ముఖం చాటేసిన వానలు సెప్టెంబర్‌లో మళ్లీ పలుకరిస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొన్నది.


Tags:    

Similar News