బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి బీజేపీ ఎన్నో చర్యలు తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని, ఎన్నికల తర్వాత బీసీని ముఖ్యమంత్రిని చేయబోతున్నామని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు అవినీతిలో కూరుకుపోయి, ప్రజల ఆశలను వమ్ము చేశారని దుయ్యబట్టారు. ఆయన మంగళవారం ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రసంగించారు.
‘‘ముస్లిం అయిన అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసింది మేమే. గిరిజన వర్గానికి చెందిన ద్రౌపది ముర్మను రాష్ట్రపతిని చేసింది కూడా మేమే. దేశప్రజలు మా పార్టీకి పూర్తి మెజార్టీ ఇచ్చి బీసీనైన నన్ను నన్ను ప్రధానిని చేశారు. నా కేబినెట్‌లో సింహభాగం బీసీలు ఉన్నారు. తెలంగాణకు కూడా బీసీ సీఎం రాబోతున్నారు. ఈ మైదానం సాక్షిగా బీసీ సీఎం అవుతారు.. ’’ అని మోదీ అన్నారు. బీఆర్ఎస్ తెలంగాణను దోచుకుందని, ఆ సొమ్మును తిరిగి రాబడతామని అన్నారు. ‘‘బీఆర్‌ఎస్ నేతలు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేశారు. దానిపై దర్యాప్తు చేస్తున్నఈడీ, సీబీఐలను విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా అవినీతికి పాల్పడినవారిని వదిలే ప్రసక్తేలేదు’’ అని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయని, ఆ పార్టీ ఒక తరం భవిష్యత్తును నాశనం చేసిందని మోదీ దుయ్యబట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు గుణపాఠం చెప్పారని, ఇప్పుడూ అదే పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. ఎన్నో బలిదానాలు చేసి సాధించుకున్న తెలంగాణను ఇప్పుడు బడుగులకు వ్యతిరేకమన పార్టీ పాలిస్తోందని, కేవలం ఒక కుటుంబమే బాగుపడిందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తోడుదొంగలని మండిపడ్డ ప్రధాని అసలైన ప్రజా ప్రభుత్వం బీజేపీతోనే సాధ్యమని అన్నారు.