దంచికొడుతున్న వానలు.. మరో మూడ్రోజులు ఇదే పరిస్థితి
అల్పపీడన ప్రభావంతో అతిభారీ వర్షాలు
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మరోవైపు వచ్చే మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. 5 జిల్లాలకు రెడ్, 7 జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. సియర్ సూన్ ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని, నైరుతి రుతుపవనాల ద్రోణి, కొంతమేరకు తెలంగాణ వైపునకు వచ్చిందని వాతావరణ విభాగం సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజులు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తున్నది. హైదరాబాద్‌లో సోమవారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. మంగళవారం, బుధవారం ఎడతెరపి లేకుండా వాన కురియగా.. గురువారం తెల్లవారుజాము నుంచే భారీ వర్షం మొదలైంది. రోడ్లన్నీ జలమయం కావడం, ఓ వైపు వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉప్పల్, రామాంతపూర్, సరూర్‌నగర్, మలక్‌పేట్, నాంపల్లి, గన్‌ఫౌండ్రీ, మెహిదీపట్నం, లక్డీకాపూల్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎర్రగడ్డ, బేగంపేట్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, హైటెక్‌సిటీ, జేఎన్‌టీయూ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది.
ఇక రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతున్నది. నిజామాబాద్ జిల్లా మాధవ్‌నగర్‌లో వరద ప్రవాహానికి బ్రిడ్జి కొట్టుకుపోయింది. నిజామాబాద్-డిచ్‌పల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నవీపేట మండంలోని జన్నేపల్లి పెద్ద చెరువు అలుగు పారుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు, కోయగూడెంలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సింగరేణి ఓపెన్ కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ శివారులోని మున్నేరు వాగు చెక్ డ్యామ్ మత్తడి పోస్తున్నది. గార్ల సమీపంలోని పాకాల ఏరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాంపురం-మద్దివంచ గ్రామ పంచాయతీల మధ్య రాకపోకలు నిలిపివేశారు. ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) మండలంలో పాలెం ప్రాజెక్ట్ ప్రధాన కాల్వకు ఒంటిమామిడి గ్రామ సమీపంలో గండి పడింది. అధికారులు గండిని పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 63 కామారెడ్డిలో 46 చెరువులు అలుగు పోస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో వర్షాలతో 436 చెరువుల్లోకి 75 శాతం వర్షం నీరు వచ్చి చేరింది. భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, వాగులకు జలకళ సంతరించుకున్నది. దాంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. వ్యవసాయ పనులు కూడా జోరందుకున్నాయి.