ముషీరాబాద్ నుంచి పోటీ చేసేది నేనే

Byline :  Krishna
Update: 2023-09-07 15:14 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గరపడుతుండడంతో రాజకీయ పార్టీలన్నీ జోరు పెంచాయి. బీఆర్ఎస్ ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీలు సరైన అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ప్రకటన సీడబ్ల్యూసీ సమావేశం తర్వాతే ఉంటుందని తెలుస్తోంది. క్యాండిడేట్ల వడపోతపై సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోలేకపోయింది. ఈ క్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతానని అంజన్ కుమార్ యాదవ్ చెప్పారు. ఎంతో మంది నాయకులు, ప్రజాప్రతినిధులు పార్టీని వీడినప్పటికీ తాను మాత్రం పార్టీ బలోపేతానికి కృషి చేసినట్లు చెప్పారు. ముషీరాబాద్ నుంచి హేమాహేమీలు బరిలోకి దిగుతారని.. అందుకే ఈసారి తనను పోటీ చేయించాలని అధిష్ఠానం నిర్ణయించిందన్నారు. కవాడిగూడ డివిజన్ కాంగ్రెస్ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ముషీరాబాద్‌తో తనకు అవినాభావ సంబంధం ఉందని అంజన్ కుమార్ చెప్పారు. ఇది తన నిర్ణయం మాత్రమే కాదని.. అధిష్ఠానం కూడా తననే పోటీ చేయమని చెప్పిందన్నారు. సర్వేల్లో తన పేరు రావడంతో అధిష్టానం తనకే టిక్కెట్ ఇస్తుందని తెలిపారు. దానం నాగేందర్, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వంటి నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయారని.. కానీ తాము మాత్రం ప్రజలకు సేవ చేస్తూ పార్టీలోనే ఉన్నట్లు స్పష్టం చేశారు.

Tags:    

Similar News