తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధిష్టానం భారీ మార్పులు చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పార్టీ హైకమాండ్.. బండి సంజయ్ ని తొలగించి, కిషన్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ ను నియమించింది. ఈ క్రమంలో మీడియాతో సమావేశం అయిన ఎంపీ ధర్మపురి అరవింద్.. నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో పార్టీ సింగిల్ గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కిషన్ రెడ్డి నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు. బండి సంజయ్ పార్టీ కోసం చాలా కష్టపడ్డారని, ఆయన నాయకత్వంలో పార్టీ అనేక విజయాలు సాధించిందని గుర్తుచేసుకున్నారు. మాటల తూటాలు పేల్చుతూ బండి.. అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేశారని అన్నారు. బండి నింపిన స్పూర్తితో రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ను పతనం చేసి, స్పష్టమైన మెజార్టీతో గెలుస్తామని జోస్యం చెప్పారు.