మూసీ ప్రాజెక్టును ముంచెత్తుతున్న వరద.. 5గేట్లు ఎత్తివేత

By :  Kiran
Update: 2023-09-05 14:37 GMT

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. మూసీ నదిలో వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టును వరద ముంచెత్తుతోంది. ఇన్ ఫ్లో భారీగా పెరగడంతో అధికారులు 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. దీంతో అధికారులు హిమాయత్‌ సాగర్‌ 4 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే కిందికి వదిలేస్తున్నారు. ప్రస్తుతం హిమాయత్‌ సాగర్‌లో నీటిమట్టం1764 అడుగులుగా ఉంది. మరోవైపు ఉస్మాన్‌ సాగర్‌ 2 గేట్లను ఎత్తారు. దీంతో మూసీ నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

మూసీ నదిని వర్షపు నీరు ముంచెత్తడంతో దాని పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. చాదర్ ఘాట్ లోయర్ బ్రిడ్జి మునిగిపోయే పరిస్థితి ఉండటంతో సమీపంలోని కాలనీవాసులను పునరావాస కేంద్రాలకు పంపారు. అటు మూసారాంబాగ్ బ్రిడ్డి వద్ద వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.


Tags:    

Similar News