ఆ పని చేసినట్లు నిరూపిస్తే ప్రాణ త్యాగానికి సైతం సిద్ధం - ముత్తిరెడ్డి
బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పార్టీ కీలక నేత పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. చేర్యాలలోని వీరభద్ర గార్డెన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. తనపై ఆరోపణలు చేస్తున్న వారికి సవాల్ విసిరారు. తాను భూకబ్జాకు పాల్పడినట్లు నిరూపిస్తే ప్రాణ త్యాగానికైనా సైతం సిద్ధమని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రజలకు సేవ చేయడం నేర్పారే తప్ప భూకబ్జాలు నేర్పలేదని ముత్తిరెడ్డి అన్నారు. తాను ఎక్కడ భూ కబ్జా చేశానో నిరూపించాలని లేదంటే వారి విజ్ఞతకే వదిలేస్తానని చెప్పారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి, జనగామ నియోజకవర్గ ప్రతినిధులను డబ్బులతో కొనుగోలు చేస్తూ పార్టీని మలినం చేస్తున్నారని ముత్తిరెడ్డి ఆరోపించారు. నియోజకవర్గ క్యాడర్ ను పల్లా రాజేశ్వర్ రెడ్డి అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ బాగు కోసం కేసీఆర్ అందరినీ ఏకం చేసి పార్టీలోకి తీసుకుంటే వారిని కుక్కలు నక్కలు అని వారితో పాటు సీఎం కేసీఆర్ ను పల్లా అవమానించారని మండిపడ్డారు. దొడ్డి కొమురయ్య వారసునికి పల్లా తన కాలేజీలో సీట్ కూడా ఇవ్వలేదన్న విషయాన్ని ముత్తిరెడ్డి గుర్తు చేశారు. ఇలాంటి వారు ప్రజా సేవ ఏం చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పల్లా పాత్ర ఏమిటో చెప్పాలని నిలదీశారు.