నాగార్జునసాగర్ ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు, కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్రం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు ఏపీ, తెలంగాణ అంగీకారం తెలిపాయి. కేంద్రం నిర్ణయం మేరకు సీఆర్పీఎఫ్ బలగాలు సాగర్ డ్యామ్ వద్దకు చేరుకున్నాయి. కేంద్ర బలగాలు తెల్లవారుజామున 5 గంటల నుంచి ఒక్కో పాయింట్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. మధ్యాహ్నానికి డ్యామ్ పూర్తిగా కేంద్రం అధీనంలోకి వెళ్లనుంది. అనంతరం సీఆర్పీఎఫ్ బలగాలు ఏపీ పోలీసులు 13వ గేటు వద్ద వేసిన కంచెను తొలగించనున్నారు. సీఆర్‌పీఎఫ్ బలగాల రాకతో తెలంగాణ పోలీసులు డ్యామ్ నుంచి వెనక్కి వచ్చారు.
ఇదిలా ఉంటే సాగర్ డ్యామ్ నుంచి కుడి కాలువకు నీటి విడుదల కొనసాగుతోంది. ప్రస్తుతం 4వేల క్యూసెక్కుల నీటిని కుడి కాలువ ద్వారా వదలుతున్నారు. మరోవైపు కృష్ణా జలాల పంపిణీ విషయంలో రెండురాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం శనివారం ఉ. 11 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాల అధికారులతో వర్చువల్గా సమావేశంకానున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎస్‌లు, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్‌లు, సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు ఛైర్మన్లు ఇందులో పాల్గొననున్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యాం, రిజర్వాయర్ల నిర్వహణ బాధ్యతలు, వాటి పరిధిలో ఉన్న ఇతర నిర్మాణాలన్నింటినీ కృష్ణా బోర్డుకు బదిలీచేసే అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.