వచ్చేవారం నల్గొండలో కేసీఆర్ భారీ బహిరంగ సభ

Update: 2024-02-05 07:28 GMT

కృష్ణా జలాల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ వచ్చే వారంలో నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. శాసన సభలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 13వ తేదీన సభ నిర్వహించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత మొదటిసారి బహిరంగ సభలో అధినేత కేసీఆర్ పాల్గోనున్నారు. కాగా నల్గొండ సభ కోసం మంగళవారం తెలంగాణ భవన్‌లో సన్నాహక సమావేశం జరగనుంది. అలాగే పార్లమెంట్ ఎన్నికలపై కూడా పార్టీ క్యాడర్‌కు సలహాలు, సూచనలు చేసే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో 10 నుంచి 12 సీట్లు గెలుపే లక్ష్యంగా.. తొలుత నల్గొండలో భారీ నిరసన సభకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న నల్గొండ, భువనగిరి గెలుపే లక్ష్యంగా కేసీఆర్ ముందుకెళ్తున్నారని.. అందుకే ఇక్కడ్నుంచే ఎన్నికల శంఖారావం మోగించుచున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఈ సభ ఉంటుందని తెలుస్తోంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు శ్రీశైలం, నాగార్జున సాగర్ ఔట్ లెట్ల స్వాధీనం విషయంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమైంది.

పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో జరిగిన అత్యున్నత సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బంజారాహిల్స్‌లోని మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో జరిగిన భేటీలో పలువురు మాజీ మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు సంబంధించి ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. తాజా పరిణామాలతో ఉత్పన్నమయ్యే పరిస్థితులను మాజీ మంత్రి హరీశ్​ రావు వివరించారు. శ్రీశైలం, సాగర్ ఔట్ లెట్లను అప్పగిస్తే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని, సాగు, తాగునీటి ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. జల విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర ఇక్కట్లు వస్తాయని పేర్కొన్నారు. కేంద్రం ఎంత ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులు అప్పగించలేదని, షరతుల గురించి సమావేశంలో వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా వాస్తవ విరుద్ధంగా మాట్లాడారని, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఎమ్మెల్యే హరీష్ రావు సమావేశంలో వివరించారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలంగాణకు నష్టం జరిగితే ఊరుకోబోమన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ విషయంలో పటిష్ట కార్యాచరణతో ముందుకు వెళ్దామని నేతలకు వివరించారు. తాను కోలుకున్నానని, ఇక ప్రజల్లోకి వస్తానని చెప్పారు.

Tags:    

Similar News