Nara Lokesh vs KTR : కేటీఆర్ ఎందుకు టెన్షన్ పడుతున్నాడో నాకు అర్థం కావడం లేదు : లోకేష్
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు .ఆయన అరెస్టును ఖండిస్తూ ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇటు తెలంగాణలోనూ టీడీపీ శ్రేణులు నిరసనలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే బాబు అరెస్టుపై తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మీడియా ముఖంగా స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ తో తెలంగాణకు ఏం సంబంధం ఉందని ఆయన ప్రశ్నించారు. ఇదంతా ఏపీలో రెండు పార్టీల వ్యవహారమని హైదరాబాద్‌లో ర్యాలీలు తీయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. (Nara Lokesh) ఈ కామెంట్స్‌పై తాజాగా నారా లోకేష్ స్పందించారు.
అసలు ఏపీతో మాకేంటి సంబంధం : కేటీఆర్
" నారా లోకేష్ నాకు ఫోన్ చేశారు. తెలంగాణలో ర్యాలీలకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు. శాంతి భద్రతల కారణంగా అనుమతి ఇవ్వలేదని చెప్పాను. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఐటీ కారిడార్‌లో ఎలాంటి ఆందోళనలు చేయలేదు. అప్పటి సర్కార్ మాకు ఎలాంటి ర్యాలీలకు పర్మీషన్ ఇవ్వలేదు. నారా లోకేష్, వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ అందరూ నా మిత్రులే. నాకు ఏపీతో ఎలాంటి గొడవలు లేవు. ఇక్కడున్న ఆంధ్ర ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు..? అసలు ఏపీతో తెలంగాణకు ఏం సంబంధం ఉంది? ఒక పార్టీగా ఆ అంశానికి ఎలాంటి సంబంధం లేదు. మా పార్టీ వాళ్లు ఎవరైనా మాట్లాడితే అది వారి పర్సనల్" అని కేటీఆర్ తెలిపారు.
ఎక్కడా లా&ఆర్డర్ సమస్య లేదు : లోకేష్
" దేశవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా రోడ్లపైకి వచ్చి మరీ చంద్రబాబు గారికి సంగీభావం తెలుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగువారు బాబు గారికి సంగీభావం తెలుపుతున్నారు. అందులో ఎలాంటి తప్పులేదు. శాంతియుతంగా వారంతా చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నారు. దానికి వారు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. సిడ్నీ, యూరప్, అమెరికా, లండన్‌లో ఉన్న ఆంధ్రులందరూ ప్రశాంతంగా ఉన్నారు. కానీ, వారి నాయకుడు చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపించడం సరికాదని శాంతియుతంగా వారి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతే తప్ప ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ సమస్యను మేము క్రియేట్ చేయలేదు. జ్యుడిషియల్ రిమాండ్‌కు వెళ్లేప్పుడు చంద్రబాబు గారు మన పోరాటం ఆగకూడదని, శాంతియుతంగా చేయాలని నాకు చెప్పారు. దానికి ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది"అని లోకేష్ కేటీఆర్ మాటలకు స్పందించారు.