3 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న లోకేశ్ యువగళం యాత్ర

Update: 2023-12-11 11:57 GMT

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం యాత్ర 3 వేల కిలో మీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా నారా లోకేశ్ పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి, దేవాన్ష్, మోక్షజ్ఞ, బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి ట్విట్టర్ ద్వారా స్పందించారు. అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె ట్విట్టర్ లో షేర్ చేశారు. లోకేశ్ మూడువేల కిలో మీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకోవడం పట్ల గర్వంగా ఉందన్నారు. నారా లోకేష్ మొత్తం 219 రోజుల్లో 3 వేల కిలో మీటర్లు పాదయాత్ర చేశారు. పది ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 92 నియోజకవర్గాల్లో ఆయన పాతయాత్ర కొనసాగింది. 217 మండలాలు.. 1915 గ్రామాలల్లో యువగళం యాత్ర నడిచింది. ఇక ఈ సందర్భంగా మొత్తం 70 బహిరంగ సభలు, 145 సమావేశాల్లో నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడమే లక్ష్యంగా నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేపట్టినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

కాగా నారా లోకేష్ యువగళం పాదయాత్రను ఈ ఏడాది జనవరిలో కుప్పం నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. ఆ తర్వాత రాయలసీమలో పూర్తి చేసుకుని.. కోస్తాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు వరకు కొనసాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో పాదయాత్రను ఆగస్టులో నిలిపివేశారు. కోనసీమ జిల్లా రాజోలు మండలంలో ఈ పాదయాత్ర ఆగింది. దీంతో లోకేష్ రాజమహేంద్రవరం, ఢిల్లీకి పరిమితం అయ్యారు. ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభించాలని భావించినా వాయిదా వేసుకున్నారు. గత నెల తిరిగి యాత్రను ప్రారంభించిన లోకేశ్ నేటితో 3 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. ఇక ఈ నెల చివరి వరకు యువగళం యాత్ర కొనసాగనుండగా.. మొత్తం 3500 కిలో మీటర్లతో యువగళం యాత్ర ముగియనున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు.



Tags:    

Similar News