నర్సాపూర్ టికెట్ సునీతా లక్ష్మారెడ్డికే! ఆయనకు అవి మైనస్?

Update: 2023-08-24 11:57 GMT

బీఆర్ఎస్ పెండింగ్‌లో పెట్టిన నర్సాపూర్ టికెట్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈసారి కూడా తనకే ఇవ్వాలని సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి గట్టిగా పోరాడుతున్నారు. ఆయన అనునుచఃరులు గురువారం కూడా హరీశ్ రావు ఇంటి వద్ద ఆందోళన నిర్వహించారు. అధిష్టానం మాత్రం ఈ విషయంలో గుంభనంగా ఉంది. రాష్ట్ర మహిళా చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డికే నర్సాపూర్ టికెట్ ఇస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మదన్ రెడ్డి వర్గానికి పోటీగా సునీత వర్గీయులు కూడా అధిష్టానంపై ఒత్తిడి పెంచడంతో కేసీఆర్ ఆచితూచి స్పందిస్తున్నారు. సునీత ఇప్పటికే కేసీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవితలను కలసి మాట్లాడారు. పార్టీ టికెట్ ఇస్తారనే తను కాంగ్రెస్‌ను వదిలి గులాబీ కండువా కప్పుకున్నానని ఆమె చెబుతున్నారు.

ఈసారి ఎలాగైనా హ్యాట్రిక్ సాధించాలని పట్టుదలతో ఉన్న కేసీఆర్ మదన్ రెడ్డి విషయంలో కూపీ లాగినట్లు తెలుస్తోంది. మదన్ రెడ్డి వృద్ధాప్యం, ఆయన అనుచరులపై అక్రమాల ఆరోపణను దృష్టిలో ఉంచుకుని ఈసారి సునీతకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. తనకు టికెట్ ఇవ్వకపోతే పార్టీని వీడతానని మదన్ చెబుతుండడంతో సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి చివరి వరకు ప్రయత్నం చేయాలని కేసీఆర్ వేచిచూస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా ప్రాధాన్యమున్న పోస్టుతో మదన్ రెడ్డి అలక తీర్చుతారని చర్చలు సాగుతున్నాయి.

అటు మదన్ రెడ్డి, ఇటు సునీత ఇద్దరూ కేసీఆర్‌కు, ఇతర పార్టీ అగ్రనేతలకు దగ్గరివారు కావడంతో టికెట్ విషయంలో పీటముడి పడింది. ‘‘టికెట్ నాకే వస్తుందని ఆశిస్తున్నాను. రాకపోతే కార్యకర్తలు బాధపడతారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను’’ అని మదన్ చెబుతున్నారు. సునీత కూడా అదే మాట చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని వీడి వచ్చిన తనకు టికెట్ విషయంలో కేసీఆర్ తప్పకుండా న్యాయం చేస్తారని ఆమె ధీమాగా ఉన్నారు. నర్సాపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్‌తో మూడుసార్లు వరుసగా గెలిచిన సునీత 2019లో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

సీఎంకు చెబుతా..

మదన్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు తన ఇంటి వద్ద ఆందోళనకు దిగడంతో హరీశ్ రావు వారితో మాట్లాడారు. ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యకర్తలు తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని, పార్టీ గెలుపుకు అందరూ కష్టపడి పని చేయాలని కోరారు. అందరికీ న్యాయం చేస్తామని, ప్రలోభాలకు గురికావొద్దని నచ్చజెప్పారు. దీంతో మదన్ రెడ్డి అనుచరులు శాంతికి వెళ్లిపోయారు.

Tags:    

Similar News