న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్ డైరెక్టర్తో రేవంత్ భేటీ.. ఆ ప్రాజెక్టుపై చర్చ

Byline :  Krishna
Update: 2024-02-01 14:03 GMT

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే లండన్ వెళ్లి థేమ్స్ నది ప్రాజెక్ట్ పై అధ్యయనం చేసి సీఎం.. మూసీ ప్రాజెక్ట్ కు సహకరించాలని అక్కడి అధికారులను కోరారు. తాజాగా న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంకు డైరెక్టర్ జనరల్ డా. డీజే పాండియన్ రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. మూసీ ప్రాజెక్ట్ సహా పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. హైదరాబాద్లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ ఏరియాను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేసినట్లు స్పష్టం చేశారు.

మూసీ నదిని సంరక్షించడంతో పాటు స్థానికులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతామని రేవంత్ తెలిపారు. అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుతూ, సహజ వనరులకు విఘాతం కలగకుండా అభివృద్ధి చేస్తామన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే రెండవ దశ మెట్రో రైల్ ప్రాజెక్ట్కు సహకరించాలని కోరారు. అదేవిధంగా ఆసుపత్రులు, విద్యాసంస్థలు, గృహ నిర్మాణాలు, వేస్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటుకు ఆర్థిక సహకారం అందించాలని పాండియన్ను రేవంత్ కోరారు. రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సాయం అందిస్తాయని పాండియన్ హామీ ఇచ్చారు.

Tags:    

Similar News