నిజామాబాద్ జిల్లా అడివి మామిడిపల్లి ఆర్వోబి నిర్మాణ పనులను ఎంపీ అర్వింద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ నిర్మాణం మీద "దేశ్ కీ నేతా కేసీఆర్, జీవనన్న ఆర్మూర్ వంటి రాతలు ఉండడంపై ఆయన విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పురుషుడని.. దేశ్ కీ నేత కాదని అన్నారు. ఒకవేళ భవిష్యత్తులో అయినా.. దేశ్ కీ నేతా కాదని, దేశ్ కా నేతా అనాలని హితబోధ చేశారు. ఈ విషయం కూడా బీఆర్ఎస్ నేతలకు తెలియకపోవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు.
ఆర్వోబి నిర్మాణానికి కేంద్రం 14 కోట్లకు పైగా నిధులు ఇచ్చినా నిర్మాణ పనులు నెమ్మదిగా సాగడంపై అర్వింద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఈఈ శంకర్ కు ఫోన్ చేసి నిర్మాణ పనులపై ఆరా తీశారు. కాంట్రాక్టర్లపై పర్యవేక్షణ చేయకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పనులు నెమ్మదిగా చేస్తున్న సంబంధిత కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టాలని నాలుగైదు నెలల క్రితమే సూచించానని.. అయినా ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు.
డిప్యూటీ ఈఈ సమాధానంపై అసహనం వ్యక్తం చేసిన అర్వింద్.. ఈఈ కాంతయ్యకి ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. రానున్న వారం రోజుల్లో పనులు ఊపందుకుంటాయని ఈఈ చెప్పగా.. నిర్మాణ పనులపై ప్రతివారం తనకు నివేదిక అందజేయాలని ఎంపీ ఆదేశించారు.