Jawaharnagar Mayor : జవహర్‌నగర్ మేయర్‌పై కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం
మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి షాక్ తగిలింది. జవహర్‌నగర్ మేయర్ మేకల కావ్యపై 19 మంది అసమ్మతి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కొత్త మేయర్‌ను ఎన్నుకున్న తర్వాత వీరాంత కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి మధ్య విభేదాలు తలెత్తగా, ఎలక్షన్స్ ముందు సుధీర్ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. కావ్య ఒంటెద్దు పోకడలకు సొంత పార్టీ అసమ్మతి కార్పొరేటర్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చి వైజాగ్ టూర్‌కు వెళ్లినట్లు సమాచారం. గులాబీ పార్టీ పునాదుల్ని కదిలించేలా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నది. క్షేత్ర స్థాయి లీడర్లను తమ వైపు గుంజుకొని ‘కారు’ టైర్లకు పంక్చర్ చేయాలని పక్కా ప్రణాళిక రచిస్తున్నది.
బీఆర్ఎస్‌లో అవమానాలు, చీదరింపులు ఎదుర్కొని పార్టీ మారేందుకు సిద్ధమైన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు గాలం వేసేందుకు కసరత్తు స్టార్ట్ చేస్తుందని తెలుస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ చాలా వీక్‌గా ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ సింగిల్ సీటు కూడా గెలవలేదు. ఎలాగైనా పార్టీని బలోపేతం చేయాలంటే ఇతర పార్టీలకు చెందిన లీడర్లను చేర్చుకోవాలని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అందులో భాగంగా బీఆర్ఎస్‌కు చెందిన కార్పొరేటర్లపై ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన 10 రోజుల్లోనే సుమారు 20 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు పార్టీ వీడేందుకు రెడీ గా ఉన్నట్టు సంకేతాలు పంపారని తెలిసింది. హైదరాబాద్ చుట్టూ ఉన్న పలు కార్పొరేషన్లకు చెందిన కార్పొరేటర్లు కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు టాక్. వీరందరికీ ఒకేసారి కాంగ్రెస్ కండువా కప్పేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ముహుర్తం ఫిక్స్ చేసినట్టు తెలిసింది.