CP Sudhir Babu : చట్టాన్ని గౌరవించే వారికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్.. రాచకొండ సీపీ
చట్టాన్ని గౌరవించే వారికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని, నేరాలు చేసే వారిపై, చట్టానికి వ్యతిరేకంగా వ్యహరించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. నిందితులకు శిక్షలు ఖరారవ్వడంలో రాచకొండ కమిషనరేట్ ముందు వరుసలో ఉందని ఆయన గుర్తు చేశారు. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. నగరంలో మాదక ద్రవ్యాల మాటే వినబడకూడదనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. డ్రగ్స్ సరఫరాదారుల మూలాలను వెలికి తీసి మరీ నిందితులను కటకటాల్లోకి నెడుతున్నట్లు తెలిపారు. విద్యాసంస్థల వద్ద ప్రత్యేక నిఘా పెడుతున్నామని చెప్పారు.
సైబర్ నేరాలు అరికట్టేందుకు కృషి చేస్తున్నామని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొత్త నెంబర్ల నుంచి ఫోన్‌కాల్స్ వస్తే బ్యాంక్ ఖాతా, ఆధార్ కార్డు, పాన్ కార్డు తదితర వివరాలు బహిర్గతం చేయొద్దన్నారు. కమిషనరేట్ పరిధిలో మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు