కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలేనని బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాలనుకున్నది కేసీఆరేనని ఆరోపించారు. తాము వార్నింగ్ ఇస్తేనే ఆయన వెనుకడుగు వేశారని స్పష్టం చేశారు. కేసీఆర్ మళ్లీ గెలిస్తే మోటార్లకు మీటర్లు పెట్టే ప్రమాదం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని బండి సంజయ్ హెచ్చరించారు. మానకొండూరు బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్తో కలిసి నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇచ్చే 6 గ్యారంటీలకు విలువ లేదని అన్నారు. ఢిల్లీలోనే కాదు కనీసం గల్లీలో కూడా అధికారం లేని కాంగ్రెస్ ఇచ్చే గ్యారెంటీలకు గ్యారెంటీ ఏంటని ప్రశ్నించారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఏటా 4 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా సరఫరా చేస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. దేశానికి అన్నంపెట్టే రైతన్నకు కనీస మద్ధతు ధరను రూ.3100 చెల్లిస్తామని చెప్పారు. దళిత బంధు, బీసీ బంధు ఎంత మందికి వచ్చిందో ప్రజలు ఆత్మవిమర్శ చేసుకోవాలని బండి సంజయ్ సూచించారు. దళిత బంధులో స్థానిక ఎమ్మెల్యేలకు 30 శాతం కమీషన్ ముందుగా ముట్టచెబితేనే మంజూరు అవుతున్నాయని కేసీఆరే స్వయంగా చెప్పారని బండి గుర్తు చేశారు. పేదలందరికీ ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్న మోడీ మరో ఐదేళ్ల పాటు దాన్ని కొనసాగించనున్నట్లు చెప్పారు.