రూ.500లకే వంట గ్యాస్పై మార్గదర్శకాలు అందలేదు: పౌరసరఫరాల అధికారి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల అమలు హామీతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేసింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్య శ్రీ పథకం కింద అర్హులైన వారికి రూ.10 లక్షల ఆరోగ్య బీమాను అమలు చేసింది. అయితే ఆరు గ్యారంటీల్లో భాగమైన రూ.500లకే గ్యాస్ సిలిండర్ (No guidelines For 500rs Gas Cylinder) పథకంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈకేవైసీ చేసుకున్న వారికే రూ.500 గ్యాస్ సిలిండర్ వస్తుందనే ప్రచారం జరుగుతుండటంతో.. మహిళలు గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. జనాలు పెద్ద ఎత్తున గ్యాస్ ఏజెన్సీలకు తరలి వస్తుండటంతో.. నిర్వాహకులు వారికి టోకెన్లు జారీ చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద ఉచితంగా అందజేస్తున్న గ్యాస్ కనెక్షన్లకు ఈకేవైసీ.. ఈ నెల 31వ తేదీలోగా చేయించాలని ఆదాశాలు జారీ చేసింది. అయితే ఈ పథకం కింద ఉచితంగా వంట గ్యాస్ పొందుతున్న లబ్దిదారుల ఆధార్ నెంబర్ తో ఈకేవైసి అనుసంధానం చేయించాల్సి ఉంటుంది. దీనికోసం గత రెండు నెలల నుండి ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. మామూలు కనెక్షన్ ఉన్నవాళ్లు కూడా ఈకేవైసి చేయించుకోవాలని గ్యాస్ ఏజెన్సీలు సూచించాయి. దాంతో రద్దీ మరింత పెరిగింది. ఇదిలా ఉండగా.. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇంకా అందలేదని, ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియకు గ్యారెంటీ పథకానికి సంబంధం లేదని రాష్ట్ర పౌరసరఫరాల అధికారి కిరణ్ కుమార్ చెప్పారు. ఉజ్వల పథకం కింద కనెక్షన్ లు ఉన్న వాళ్లు మాత్రమే ఈకెవైసి చేయించుకోవాలని ఆయన సూచించారు.