NTR Death Anniversary: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన నందమూరి వారసులు
నేడు టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారకరామరావు 28 వ వర్ధంతి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు, సినీనటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళులర్పించారు. గురువారం వేకువజామునే అక్కడికి చేరుకుని అంజలి ఘటించారు. ఇక ఆ తర్వాత ఉదయం 7 గంటల సమయంలో ఎన్టీఆర్ తనయుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకొని, సమాధి వద్ద పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బాలకృష్ణతో పాటుగా నందమూరి రామకృష్ణ, సుహాసిని.. ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ నటించిన సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయని తెలిపారు. ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని అన్నారు.