Ration Card News: రేషన్‌కార్డులు ఉన్న వారికి అలర్ట్‌.. 15 రోజులే గడువు

Byline :  Veerendra Prasad
Update: 2024-01-16 02:34 GMT

రేషన్‌ లబ్ధిదారులకు ఈ-కేవైసీని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఆహారభద్రత కార్డులోని సభ్యులందరూ సంబంధిత రేషన్‌ దుకాణానికి వెళ్లి ఈ-కేవైసీ చేయించుకోవాలని పౌరసరఫరాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ-కేవైసీ కోసం పలుమార్లు గడువు పొడిగించిన అధికారులు ఈసారి జనవరి 31 వరకు అవకాశమిచ్చారు. రేషన్‌ కార్డు / ఆహార భద్రత కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు తప్పకుండా ఈ నెలాఖరు లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. దగ్గర్లో ఉన్న రేషన్‌ డీలర్‌ వద్ద ఉండే ఈ పాస్‌ మెషీన్‌ ద్వారా మాత్రమే ఇది చేయాలి. రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డులను తొలగించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఈ-కేవైసీని ప్రారంభించిన విషయం తెలిసిందే. కార్డులో ఎంతమంది పేర్లుంటే అంత మంది సమీప రేషన్ దుకాణాలకు వెళ్లి వేలిముద్రలు ఇవ్వాలి.

అయితే ఆధార్‌ అప్‌డేషన్‌ ప్రక్రియ పూర్తవకపోవడంతో ఈ - కేవైసీ చేసుకోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్‌ కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. అధికారులు మాత్రం ఈ నెలాఖరు ఎవరైనా ఆధార్ లింక్ చేసుకోని వారు వెంటనే చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ రేషన్ కార్డుతో ఆధార్ కార్డు సీడింగ్ చేసుకోని ఖాతాదారుల రేషన్ కార్డును నకిలీగా భావించి డిలీట్ చేయనుంది ప్రభుత్వం. అంతేకుండా.. ఇలా డిలీట్ అయినట్లయితే ప్రభుత్వ డేటాలో మీ రేషన్ కార్డు వివరాలు తొలిగిపోతాయి. దాంతో మీకు వచ్చే రేషన్ సరుకులు నిలిచిపోతాయి. రేషన్ కార్డును ఆధార్ నంబర్‌తో లింక్ చేయడానికి మీరు మీ రేషన్ కార్డ్‌లోని సభ్యులందరి ఆధార్ నంబర్‌ను ఇవ్వాలి. వాటి ఆధారంగా ఈ కేవైసీ పూర్తవుతుంది.

రేషన్ కార్డు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయితే అసలైన లబ్ధిదారులు ఎంత మంది ఉన్నారు అనే విషయంపై ప్రభుత్వానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అనంతరం కొత్త రేషన్ కార్డులపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. తెలంగాణ ప్రజలు హామీ పథకాల ప్రయోజనాలను పొందేందుకు వారి రేషన్ కార్డ్ కేవైసీని తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 30 నాటికి 70.80 శాతం ఈ కేవీసీ పూర్తయింది. 87.81 శాతం నమోదుతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అత్యల్పంగా వనపర్తి జిల్లాలో 54.17 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు.




Tags:    

Similar News