5 రకాల వంగడాలతో వరి చేనులో శివ సాక్షాత్కారం

Update: 2023-08-28 05:35 GMT

ఆర్గానిక్ ప‌ద్ద‌తిలో వ్యవసాయం చేసే చాలామందికి నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు చిన్నికృష్ణుడి గురించి తెలిసే ఉంటుంది. వ్యవసాయంపై మక్కువతో ఈ రైతు పొలంలో ప్రతీసారీ ఏదో ఒక అద్భుతాలు సృష్టిస్తూనే ఉన్నాడు. పలు ఆకృతుల్లో పంటలను సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. నిజామాబాద్‌ (Nizamabad) జిల్లా జక్రాన్‌పల్లి మండలంలోని చింతలూర్‌ గ్రామానికి చెందిన నాగుల చిన్నగంగారాం(చిన్నికృష్ణ).. ఈసారి శివ లింగం, ఓం ఆకారంలో ఐదు రకాల వరి వంగడాలతో పంటను సాగు చేశారు. ఆయన చేస్తున్న వినూత్న వ్యవసాయం అందరినీ ఆకట్టుకుంది.

శివ లింగానికి క్షీరాభిషేకం చేస్తే కిందకు ధారగా పాలను తాకకుండా తిరుగుముఖంతో చేసే సోమసూత్ర ప్రదక్షిణకు ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో వివరించేలా విలక్షణంగా తన వ్యవసాయ క్షేత్రాన్ని తయారు చేసి అబ్బురపరుస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో దేశ రాజధాని దిల్లీలో నిర్వహించే జీ-20 సమావేశాల నేపథ్యంలో అతిథులకు స్వాగతం పలుకుతూ అద్భుతంగా అక్షరాలు పొందుపరిచి ఈ సారి ఈ విలక్షణమైన పంటతో ఆకట్టుకుంటున్నారు.

తన వ్యవసాయక్షేత్రంలో 16 గుంటల విస్తీర్ణంలో గోదావరి ఇసుక, కాలబట్టి, పంచరత్ర, బంగారు గులాబీ, చింతలూరి సన్నాలు తదితర ఐదు దేశీయ వరి వంగడాలతో ఈ ఆకృతిని రూపొందించారు. హైదరాబాద్‌కు చెందిన డా.రాకేశ్‌రెడ్డి సూచనతో వేదపండితుల ప్రేరణతో తాను సోమసూత్ర ప్రదక్షిణ ఆకారంలో పంట పండించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం 50 రోజుల పంటకాలంతో పైరు ఆద్భుతంగా కనిపిస్తోందని, విద్యార్థులకు, రైతులకు దీని విశిష్టతను వివరిస్తున్నట్లు వెల్లడించారు. గతేడాది ఇదే రైతు తన తల్లిదండ్రుల చిత్రాలు ప్రతిబింబించేలా పంట సాగు చేశారు. త‌ల్లిదండ్రుల చిత్రాల‌ను వరి నారుతో గీయించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. చిన్ని కృష్ణుడు 2020 డిసెంబర్‌ 16న ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా రైతు నేస్తం పురస్కారాన్ని కూడా అందుకున్నారు.





Tags:    

Similar News