Minister Mahender Reddy: మంత్రిగా ప్రమాణం చేసిన పట్నం మహేందర్‌రెడ్డి

Update: 2023-08-24 10:49 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయనతో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడతానని పట్నం స్పష్టం చేశారు. ఈటల రాజేందర్‌ను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత... ఆ స్థానం ఖాళీగా ఉంది. దీంతో ఆ స్థానాన్ని కేసీఆర్ పట్నంతో భర్తీ చేశారు. మహేందర్ రెడ్డి బుధవారమే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా.. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో అది వాయిదా పడింది.

పట్నం మహేందర్ రెడ్డి 1994,1999, 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిపొందారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన బీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగోసారి తాండూరు ఎమ్మెల్యేగా విజయం సాధించి తెలంగాణ తొలి ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పైలట్‌ రోహిత్‌ రెడ్డి చేతిలో మహేందర్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. దీంతో బీఆర్ఎస్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది.

ఆ తర్వాత పరిణామాల్లో భాగంగా రోహిత్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. దీంతో తాండూరులో పరిస్థితి పైలెట్ వర్సెస్ పట్నం అన్నట్లు మారింది. తాజాగా తాండూరు టికెట్ మరోసారి రోహిత్ రెడ్డికి ఇచ్చారు. దీంతో పట్నం బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరడం ఖాయమన్న పుకార్లు షికారు చేశాయి. ఈ క్రమంలో కేసీఆర్ పట్నం మహేందర్ రెడ్డికి బంపరాఫర్ ఇచ్చారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా మంత్రి పదవి కట్టబెట్టారు.




Tags:    

Similar News